తట్టుకోలేని బాధలు వస్తే సన్యాసం తీసుకుంటారు.. కానీ శరత్‌ బాబు అలా చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • శరత్‌ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించారన్న పరుచూరి గోపాలకృష్ణ
  • పవన్‌ కల్యాణ్‌ సినిమాలో చూసినప్పుడే ఆయన ఆరోగ్యం బాగోలేదేమోనని తనకు అనిపించిందని వ్యాఖ్య
  • ఇండస్ట్రీలోని గొప్ప నటులంతా వెళ్లిపోతుంటే ఎంతో బాధగా ఉందని భావోద్వేగం 
దివంగత నటుడు శరత్‌ బాబు ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేదని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. శరత్ బాబు గొప్ప నటుడని, ఆయన మన మధ్య లేరనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్న ఆయన.. తాజాగా శరత్‌ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియో చేశారు.

ఇండస్ట్రీలోని గొప్ప నటులంతా వెళ్లిపోతుంటే ఎంతో బాధగా ఉందని గోపాలకృష్ణ అన్నారు. ‘‘శరత్‌ బాబు మా ఇంటికి సమీపంలో ఉండేవారు. ప్రతిరోజూ వాకింగ్‌ చేస్తున్నప్పుడు కనిపించే వారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆయనకు నవ్వు దేవుడిచ్చిన వరం. ఈ మాటను ఎన్నోసార్లు ఆయనతో చెప్పాను’’ అని వివరించారు. 

శరత్ బాబుతో కలిసి తాను ఎన్నో సినిమాలకు పనిచేశానని చెప్పారు. ఆయన అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలియగానే త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వారిలో తానూ ఒకడిని అని అన్నారు. ‘‘మనకున్న అతికొద్ది మంది సహజ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ఎన్నో భాషల్లో నటించారు. ఒక తెలుగు నటుడు ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించాడంటే మాములు విషయం కాదు. అద్భుతమైన పాత్రలు చేశారు’’ అని కొనియాడారు.

పవన్‌ కల్యాణ్‌ సినిమాలో శరత్‌ బాబును చూసినప్పుడే ఆయన ఆరోగ్యం బాగోలేదేమోనని తనకు అనిపించిందని గోపాలకృష్ణ అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. కొంతమంది మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయని, తట్టుకోలేని స్థాయిలో బాధలు వస్తే సన్యాసం తీసుకుంటారని అన్నారు. కానీ శరత్‌ బాబు అలా చేయలేదని చెప్పారు. ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించారని అన్నారు. ఆ మౌనంలో కన్నీరు పెట్టుకున్నారేమో గానీ, బయట ఎప్పుడూ బాధపడలేదని, ఆయన అలాంటి మహానుభావుడని భావోద్వేగానికి గురయ్యారు.


More Telugu News