ఆ మెడికల్ కాలేజీతో నాకు సంబంధం లేదు: సుజనా చౌదరి

  • 2014లోనే మెడికల్ కాలేజీ డైరెక్టర్ గా తప్పుకున్నానన్న సుజనా చౌదరి
  • తాను టీడీపీ కోవర్ట్ కాదని వ్యాఖ్య
  • టీడీపీతో పొత్తు వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని వెల్లడి
దేశ వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల అనుమతులను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో బీజేపీ నేత సుజనా చౌదరికి చెందిన మెడికల్ కాలేజీ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సుజనా చౌదరి స్పందించారు. చాలా సంస్థల్లో తాను డైరెక్టర్ గా ఉన్నానని ఆయన అన్నారు. గుర్తింపు రద్దయిన మెడికల్ కాలేజీ డైరెక్టర్ గా 2014లోనే తాను తప్పుకున్నానని చెప్పారు. ఆ మెడికల్ కాలేజీ పాలనా వ్యవహారాల్లో తనకు సంబంధం లేదని అన్నారు. కాలేజీల్లో ప్రమాణాలను పెంచే క్రమంలో, నిబంధనలను సరిగ్గా పాటించని కాలేజీల అనుమతులను రద్దు చేయడం మంచిదేనని చెప్పారు. 

తాను టీడీపీ కోవర్ట్ ను కాదని, బీజేపీ నాయకుడినని సుజనా చౌదరి అన్నారు. తన గురించి ఎవరో ఏదో అంటే స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని తెలిపారు. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. చట్ట ప్రకారం ఏపీకి చేయాల్సిన సహాయాన్నంతా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.


More Telugu News