కర్ణాటక సీఎం సలహాదారుగా సునీల్ కనుగోలు

  • కేబినెట్ హోదాతో నియామకం.. దాదాపుగా ఖరారు
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన సునీల్
  • పే సీఎం, 40 శాతం ప్రభుత్వం నినాదాల రూపకర్త
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చడంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని సిద్ధరామయ్య సర్కారు నిర్ణయించింది. సీఎం సలహాదారుగా కేబినెట్ హోదాతో పదవి కట్టబెట్టనుంది. ఈ నియామకం ఇప్పటికే దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాల సమాచారం. అయితే, సీఎం సిద్ధరామయ్య సలహాదారుగా సునీల్ కనుగోలు నిర్వర్తించే విధులు ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు సంపాదించుకున్న సునీల్ కనుగోలు మొదట ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ లో చేరారు. 2014లో ఎన్డీఏ సర్కారును కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆపై పీకేతో విడిపోయి తనే సొంతంగా మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థను ప్రారంభించారు. డీఎంకే, అన్నాడీఎంకే, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందించారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచార వ్యూహకర్తగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఓటమికి కారణమైన పే సీఎం, 40 శాతం కమిషన్ సర్కారు.. నినాదాలను సునీల్ కనుగోలు రూపొందించాడు. కర్ణాటకలోని బళ్లారి మూలాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.


More Telugu News