ఆఖరి ఓవర్‌లో మోహిత్‌ను అలా డిస్టర్బ్ చేస్తావా?: పాండ్యాపై గవాస్కర్ అసహనం

  • ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన మోహిత్ శర్మ
  • చివరి ఓవర్ 4 బంతుల తర్వాత మోహిత్ తో పాండ్యా గుసగుస
  • బాగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అలా వెళ్లడమేమిటన్న గవాస్కర్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ అదరగొట్టాడు. 13 మ్యాచ్ లు ఆడి 27 వికెట్లు తీశాడు. జట్టును ఫైనల్ కు తీసుకు వెళ్లడంలో మంచి పాత్రను పోషించాడు. అయితే పైనల్ మ్యాచ్ లో మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ... చివరి ఓవర్ చివరి రెండు బంతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ జడేజా 10 పరుగులు చేయడంతో ధోనీ సేన విజయం సాధించింది.

వర్షం కారణంగా లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో  కెప్టెన్ పాండ్యా ఆఖరి ఓవర్ లో పేసర్ మోహిత్ శర్మ చేతికి బంతిని ఇచ్చాడు. చెన్నై ఆటగాళ్లు శివం దుబే, జడెజా క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి బంతిని యార్కర్ గా విసిరిన మోహిత్ పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. రెండో బాల్ యార్కరే. దుబే ఒక్క పరుగు తీశాడు. మూడు, నాలుగు బంతుల్లోనూ సింగిల్సే వచ్చాయి. ఇక చెన్నై విజయానికి 2 బంతుల్లో పది పరుగులు కావాలి.

ఆ సమయంలో కెప్టెన్ పాండ్యా వచ్చి మోహిత్ తో ముచ్చటించాడు. తర్వాత మోహిత్ వేసిన బంతిని జడేజా సిక్స్ గా మలిచాడు. చివరి బంతికి నాలుగు పరుగులు తీశాడు. దీంతో చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. చివరి రెండు బంతులు ఉన్న సమయంలో పాండ్యా వచ్చి మోహిత్ తో ముచ్చటించడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతులను మోహిత్ అద్భుతంగా బౌల్ చేశాడని, కానీ మధ్యలో పాండ్యా వచ్చి ఏదో మాట్లాడాడని, ఓ బౌలర్ బాగా బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడిని ఎవరూ కూడా డిస్టర్బ్ చేయకూడదని సునీల్ గవాస్కర్ అన్నారు. 

బౌలర్ సరైన రీతిలో బౌల్ చేస్తున్నప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకని పాండ్యాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాగా బౌలింగ్ చేస్తున్నావు అని దూరంగా ఉండి అభినందించవచ్చని, కానీ ఫామ్ లో ఉన్న బౌలర్ దగ్గరకు వెళ్లి మాట్లాడడం సరికాదన్నారు. 

మంచిగా బౌలింగ్ చేస్తున్న బౌలర్ వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వవద్దని చెప్పారు. పాండ్యా అక్కడకు వెళ్లగానే మోహిత్ ముఖమే మారిపోయిందని చెప్పాడు.


More Telugu News