అవినాశ్ రెడ్డి బెయిల్ ఉదంతం.. టీవీ డిబేట్లలోని వ్యాఖ్యలపై న్యాయమూర్తి సీరియస్.. ఆ వీడియో క్లిప్పింగ్స్ కావాలంటూ ఆదేశాలు!

  • అవినాశ్ రెడ్డికి బెయిల్ మీద టీవీ డిబేట్‌లో నేతల వ్యాఖ్యలు
  • ఆ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయన్న న్యాయమూర్తి
  • సెలెక్టివ్ మీడియా తన ప్రతిష్ఠను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమన్న జడ్జి
  • వీడియో క్లిప్పింగ్స్ హైకోర్టు సీజే ముందు ఉంచాలని ఆదేశాలు 
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి ఇటీవల రెండు టీవీ ఛానళ్లలో డిబేట్ జరిగింది. ఈ డిబేట్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వాలని రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఆర్డర్ కాపీ ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చారు. రెండు టీవీ డిబేట్ లలో పాల్గొని, కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్నారు. అయితే వారిపై చర్యలు తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వదిలేశారు.

సెలెక్టివ్ మీడియా తన ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను చేస్తూ న్యాయప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, తద్వారా తాను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నమని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మే 26 నాటి మహా న్యూస్, ఏబీఎన్ న్యూస్ చర్చల ఆర్డర్, వీడియో క్లిప్పింగ్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సదరు న్యాయమూర్తి హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

సెలెక్టివ్ మీడియా... వ్యక్తిగత దాడి ద్వారా తన ప్రతిష్టను దిగజార్చడానికి, భయపెట్టడానికి, బెదిరించడానికి... తమకు నచ్చిన లేదా ఎంపిక చేసిన వ్యక్తుల అభిప్రాయాలను ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో అగ్రగామిగా ఉన్న మీడియా పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు జడ్జి. కానీ కొంతమంది కారణంగా రోజురోజుకు దిగజారుతున్నాయని, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మేజిస్ట్రేట్ ఒకరు... హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయంటూ ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారన్నారు. గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఒకరి ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయడం పట్ల తాను ఆందోళన చెందుతున్నానని  పేర్కొన్నారు. వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలు సరికాదన్నారు. సంఘటిత ప్రయత్నాల ద్వారా మన ప్రతిష్టను కాపాడుకోవాల్సిన సమయమన్నారు. తనపై వ్యక్తిగతంగా మాట్లాడినందుకు కాదని, కానీ సెలెక్టివ్ మీడియా ద్వారా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు బాధించాయన్నారు. తన దృష్టిలో ఇది కోర్టు ధిక్కార చర్య అన్నారు. అయితే వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని హైకోర్టు నిర్ణయిస్తుందన్నారు. ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకొని విచారణను కొనసాగించానని చెప్పారు.


More Telugu News