చెన్నై గెలుపు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సంబరాలే సంబరాలు
- తమ అభిమాన టీమ్ గెలవాలన్న బలమైన ఆకాంక్ష
- విజయం కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్న దృశ్యాలు
- చివరి బంతికి విజయం చేకూరడంతో కేరింతలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అభిమానులు ఎక్కువనే విషయం అందరికీ తెలుసు. ప్రొఫెషనల్ గా ఆడే జట్లలో ఇది కూడా ఒకటి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ జట్టుకు ప్రధాన ఆకర్షణలో ఒకటిగా చెప్పుకోవాలి. ధోనీ కోసం ఐపీఎల్ చూసేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సీఎస్కే ఫైనల్ కు చేరడంతో, తుది మ్యాచ్ ను చూసేందుకు ఎంతో మంది ఎక్కడికక్కడే రెడీ అయి కూర్చున్నారు. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ సోమవారం రాత్రికి వాయిదా పడింది. అయినా సరే స్టేడియం మొత్తం చెన్నై అభిమానులతో నిండిపోయింది.
మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్ చాలా ఆలస్యం అయింది. అయినా కానీ ఓపికగా అభిమానులు వేచి చూశారు. ఇక ఇళ్లల్లో టీవీల ముందు కూర్చున్న వారికి లేక్కే లేదు. ఉన్న చోట నుంచే ఫోన్లలో వీక్షించే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఇలా ఎక్కడి వారు అక్కడే, ఎగిరి గంతేశారు. రవీంద్ర జడేజా చివరి బంతిని బౌండరీకి తరలించడంతో చెన్నై గెలుపు ఖాయమైంది. చివరి ఓవర్ లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ స్టేడియంలో కూర్చున్న వారు చెన్నై గెలుపును కోరుకోవడం కనిపించింది. ఓ చిన్నారి అయితే దేవుడ్ని ప్రార్థించడాన్ని చూడొచ్చు. ఓ వృద్ధురాలు అయితే ఒకేసారి ఉత్సాహంగా స్పందించింది. క్రికెట్ మ్యాజిక్ అంటే ఇదేనేమో అన్నట్టుగా అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి.