టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు: యనమల రామకృష్ణుడు

  • సంక్షేమం ప్రారంభమైందే ఎన్టీఆర్ తో అన్న యనమల
  • సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధిని జత చేశారని వ్యాఖ్య
  • రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా జగన్ పాలన సాగుతోందని విమర్శ
మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో జగన్ రెడ్డి దుష్టపాలనకు ముగింపు పలకబోతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సంక్షేమం ప్రారంభమైందే నందమూరి తారకరామారావు, తెలుగుదేశం పార్టీతోనని... చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మరింత పెంచి అభివృద్ధిని జత చేశారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంతో తెలుగుదేశం ముందుకు వెళ్తుంటే.. లూటీ కోసం అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా జగన్ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. మహాశక్తి పథకంతో మహిళాశక్తి మహాశక్తిగా మారబోతోందని అన్నారు. గతంలో డ్వాక్రాను ప్రారంభించి మహిళాభివృద్ధి చేసి చూపింది చంద్రన్నేనని చెప్పారు.

స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు అందిస్తామని యనమల చెప్పారు. గతంలో దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఇప్పుడు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి జగన్ రెడ్డి పెంచిన గ్యాస్ ధరల నుండి విముక్తి కలిగించేందుకు నిర్ణయించారని చెప్పారు. యువగళంతో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి అందించి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తామని తెలిపారు. అన్నదాతలకు ఏటా రూ. 20 వేల చొప్పున అందించి రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. సంపద సృష్టించడం తెలిసిన వారికే సంక్షేమం విలువ తెలుస్తుందని అన్నారు. 

చంద్రబాబు విజన్ 2020తో నాడు సృష్టించిన సంపద.. నేడు హైదరాబాద్ నగరాన్ని, డ్వాక్రా వ్యవస్థతో మహిళల్ని ప్రపంచ పటంలో నిలిపిందని యనమల చెప్పారు. అదే స్ఫూర్తితో నేడు విజన్ 2047 రూపొందించారని అన్నారు. సంపద సృష్టించి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా కలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనని చెప్పారు. జగన్ రెడ్డి మాయ మాటలతో నవమోసాలకు గురైన ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ కలిగిస్తామని అన్నారు. అమ్మఒడికి రూ. 13 వేలు ఇచ్చి, నాన్నబుడ్డీలో రూ. 70 వేలు కొట్టేశారని విమర్శించారు. డ్రైవర్‌కు రూ. 10 వేలు ఇచ్చి డీజిల్, పెట్రోల్, పోలీస్, ఆర్టీఓ జరిమానాలు పెంచి, మద్యం రేట్లు, కరెంటు ఛార్జీలు పెంచి ఏడాదికి రూ.లక్ష కొట్టేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News