మంత్రి గారూ.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని గేట్లు ఉంటాయో తెలుసా?: ఎమ్మెల్సీ అనురాధ

  • చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారన్న అనురాధ
  • వైసీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ అని, ప్రజలు ఏనాడో చించేశారని విమర్శ
  • బాధిత కుటుంబాల దగ్గర వాటాలు అడిగిన నీచచరిత్ర అంబటి రాంబాబుదని మండిపాటు
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేశ్ పై పిచ్చివాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని, దాన్ని ప్రజలు ఏనాడో చించేశారని విమర్శించారు.

మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ‘‘అంబటి రాంబాబు మంత్రిగా ఏం చేశారు? పోలవరం డీపీఆర్ ఆమోదించటం చేతకాదు. నిర్వాసితులకు ఇళ్లు కట్టలేదు. పరిహారం ఇచ్చే దమ్ము లేదు. కానీ సిగ్గులేకుండా చంద్రబాబు గురించి మాట్లాడుతారా?’’ అంటూ దుయ్యబట్టారు.

బాధిత కుటుంబాల దగ్గర వాటాలు అడిగిన నీచచరిత్ర అంబటిది అని మండిపడ్డారు. ‘‘మంత్రిగా ఏనాడైనా ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్లి సమీక్ష చేశారా? పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా? సుజల స్రవంతి అడ్రస్ ఎక్కడుందో తెలుసా?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘దేవుడి మాన్యాలు కాపాడలేని దద్దమ్మ కొట్టు సత్యనారాయణకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరెత్తలేని జోగి రమేశ్.. టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడటం సిగ్గుచేటు. మంత్రి కాకాణికి కోర్టులో ఫైళ్లు దొంగతనం చేయటంపై ఉన్న అవగాహన వ్యవసాయం మీద లేదు. పెద్దిరెడ్డి ముందు కుర్చీలో కూర్చోలేని డిప్యూటి సీఎం నారాయణ కూడా చంద్రబాబుపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉంది’’ అని అనురాధ ప్రశ్నించారు.


More Telugu News