జీవితం మొత్తం హాయిగా నవ్వగలను.. తన రిటైర్ మెంట్ పై అంబటి రాయుడు!
- 30 ఏళ్లుగా తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న అంబటి రాయుడు
- ఇలా కెరీర్‌ను ముగిస్తుండటం సంతోషంగా ఉందని వెల్లడి
- రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించిన ధోనీ
- ‘లెజెండ్.. విన్నర్.. హ్యాపీ రిటైర్మెంట్ అంబటి’ అంటూ ఎంఐ ట్వీట్
తన సుదీర్ఘ కెరియర్ కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు నిన్నటితో వీడ్కోలు పలికాడు. ధోనీ జపం కారణంగా రాయుడు రిటైర్ మెంట్ కు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కానీ ఐపీఎల్ 2023 ట్రోఫీని రాయుడు అందుకునేలా చేసి.. ధోనీ సముచితంగా గౌరవించాడు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, జై షా చేతుల మీదుగా ట్రోఫీని రాయుడు అందుకున్నాడు.
మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు గురించి ధోనీ మాట్లాడుతూ.. ‘‘అతడు మైదానంలో ఉంటే నూటికి నూరు శాతం అంకితభావంతో ఆడతాడు. మేం ఇండియా తరఫున కూడా ఆడాం. రాయుడు నా జట్టులో ఉన్నాడంటే.. నేను ఫెయిర్ ప్లే అవార్డు గెలుచుకోలేను’’ అని నవ్వేశాడు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించాడు. స్పిన్, ఫాస్ట్ బౌలర్లను రాయుడు సమర్థవంతంగా ఎదుర్కొంటాడని చెప్పాడు. ‘‘ఈ మ్యాచ్‌లో అతడు ఏదైనా స్పెషల్ చేస్తాడని భావించా. అతడిని చూస్తే ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌ను రాయుడు చాలా కాలంపాటు గుర్తుంచుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.
అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ముంబై, చెన్నై జట్ల తరఫున ఐపీఎల్లో ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నా మిగతా జీవితం మొత్తం హాయిగా నవ్వగలను. 30 ఏళ్లుగా నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇలా కెరీర్‌ను ముగిస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నకు, కుటుంబానికి ధన్యవాదాలు. వాళ్లు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని తెలిపాడు.
మరోవైపు ఈ ఐపీఎల్ టైటిల్‌ను అంబటి రాయుడికి సీఎస్కే అంకితం ఇచ్చింది. ఈసారి టైటిల్ గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్న రుతురాజ్ గైక్వాడ్.. రిటైర్ అవుతున్న రాయుడికి టైటిల్‌ను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఫైనల్ ముగిశాక రాయుడు, జడేజాతో కలిసి ధోనీ నవ్వుతూ గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముంబయి ఇండియన్స్ కూడా రాయుడు రిటైర్ మెంట్ పై స్పందించింది. ‘‘ఆరుసార్లు ఐపీఎల్ చాంపియన్, లెజెండ్.. విన్నర్.. హ్యాపీ రిటైర్మెంట్ అంబటి’’ అని ట్వీట్ చేసింది. ఇక తన కెరియర్ లో 203 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రాయుడు 187 ఇన్నింగ్స్‌ల్లో 4,348 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా.. 200కిపైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్ రాయుడే కావడం విశేషం.