దటీజ్ ధోనీ.. కోట్ల మంది అభిమానించేది ఇందుకే!

  • ఐపీఎల్ 2023ని చెన్నై గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన ధోనీ
  • రిటైర్ మెంట్ ప్రకటించిన అంబటి రాయుడిని గౌరవించిన ఎంఎస్
  • ట్రోఫీని అందుకునేందుకు రాయుడుని పంపిన చెన్నై కెప్టెన్
ధోనీ అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. అభిమానులకు మంత్రం. గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, కోహ్లీ లాంటి ఎందరో దిగ్గజాలు ఉన్న మన దేశంలో అతడికే అంత ఫాలోయింగ్ ఎందుకు? ఆ దిగ్గజాల కంటే అతడు గొప్ప ఆటగాడా? అంటే కావచ్చు.. కాకపోవచ్చు..!

కానీ ధోనీ ఓ నిఖార్సయిన నాయకుడు! భావోద్వేగాలు ఉచ్ఛస్థితిలో ఉండే క్రికెట్ లో స్థితప్రజ్ఞతతో కనిపించే కెప్టెన్! 

మ్యాచ్ ఓడినప్పుడు మీడియా ముందుకు తానే వస్తాడు.. ప్రశ్నలనే కాదు.. విమర్శలనూ తానే స్వీకరిస్తాడు. నవ్వుతూ బదులిస్తాడు. వీలైతే సున్నితంగా కౌంటర్ ఇచ్చి వెళ్తాడు! అదే మ్యాచ్ గెలిచినప్పుడు.. గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన ఆటగాడిని మీడియా ముందుకు పంపుతాడు. ప్రశంసలన్నీ ఆ ఆటగాడికే దక్కేలా చూస్తాడు. తాను తెరవెనుకే ఉంటాడు. 

సిరీస్ లు గెలిచినప్పుడు కప్పు అందుకోడానికి వెళ్తాడు.. కెప్టెన్ కాబట్టి. కానీ సంబరాల్లో గమనిస్తే ట్రోఫీ దరిదాపుల్లో ఉండడు. ఆ గుంపులో ఓ పక్కన నిలబడి ఉంటాడు. ఆనందమంతా యువ ప్లేయర్లదే. ఫొటోల్లో కనిపించాలి కాబట్టి.. జట్టు సభ్యులతో పాటు ఉంటాడంతే.

టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన ధోనీని కొందరు విమర్శకులు అద‌ృష్టవంతుడంటారు. అందుకే అన్ని విజయాలు దక్కాయంటారు. అదృష్టవంతుడు కావచ్చు. కాకపోవచ్చు. అదృష్టం అందలం ఎక్కించొచ్చు. అభిమానాన్ని అందిస్తుందా? ఈ ప్రశ్నలోనే సమాధానముంది.

ఐపీఎల్ టోర్నీ మొత్తం కలిపి ఓ 100 బంతులు కూడా ఆడి ఉంటాడో లేదో. మోకాలి గాయంతో బాధపడుతూనే టోర్నీ మొత్తం ఆడాడు. గాయం తీవ్రం కాకుండా చివరి ఓవర్లలో వచ్చే వాడు. అతడు ఆడే రెండు మూడు బంతుల కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారు. చెన్నై అభిమానులైతే తమ సొంత జట్టు ప్లేయర్ ఔట్ అవ్వాలని కోరుకునే వారు. వికెట్ల వెనుక కీపర్ గా, కెప్టెన్ గా ధోనీ భారమంతా మోశాడు. చెన్నైని విజయతీరాలకు చేర్చాడు.

ఐపీఎల్ 2023ని గెలుచుకున్నాక ధోనీ వ్యవహరించిన తీరు.. అతడి వ్యక్తిత్వానికి ఓ మచ్చుతునక. ట్రోఫీ అందుకోవడానికి వెళ్లిన మహీ.. తన వెంట అంబటి రాయుడిని, రవీంద్ర జడేజాని తీసుకెళ్లాడు. జడేజా, తాను చెరోపక్కన నిల్చుంటే.. ట్రోఫీని అంబటి రాయుడు అందుకున్నాడు. తన క్రికెట్ కెరియర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన రాయుడిని అలా గౌరవించుకున్నాడు.

అదీ ధోనీ అంటే. అందుకే అతడు కోట్ల మందికి ఆరాధ్యుడయ్యాడు. తొలి తరం క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంతటి వ్యక్తి తన గుండెలపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నది ఇందుకే!


More Telugu News