గ్రేటర్ హైదరాబాదులో ఇక సాధారణ ప్రయాణికులకూ రూట్ పాస్

  • కేవలం రూ.600 లతో నిర్ణీత రూట్ లో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు
  • తక్కువ దూరం ప్రయాణించే వారికి ఉపయోగకరం అంటున్న అధికారులు
  • తొలుత 162 రూట్లలో పాస్ లు జారీ చేయనున్నట్లు వెల్లడి
గ్రేటర్ హైదరాబాదు పరధిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. సాధారణ ప్రయాణికులకు కూడా రూట్ పాస్ లు ఇస్తున్నట్లు వెల్లడించింది. నిర్ణీత రూట్ లో తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ పాస్ తో గొప్ప వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 162 రూట్లలో ఈ పాస్ లను జారీ చేస్తున్నామని, ఎవరైనా సరే రూ.600 చెల్లించి ఆర్డినరీ పాస్ తీసుకోవచ్చని తెలిపారు. మెట్రో బస్సుల్లో ప్రయాణించాలనుకుంటే రూ.1000 చెల్లించి మెట్రో పాస్ తీసుకోవచ్చని చెప్పారు. గుర్తింపు కార్డు కోసం రూ.50 అదనంగా చెల్లించాలని వివరించారు. ఈ పాస్ లతో 8 కిలోమీటర్ల దూరం (నిర్ణీత రూట్ లో) రోజుకు ఎన్నిసార్లు అయినా సరే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రమే ఈ పాస్ లను అనుమతిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో రూట్ పాస్ లను కేవలం విద్యార్థులకు మాత్రమే జారీ చేసే పాస్ లను ప్రస్తుత అవసరాల దృష్ట్యా సాధారణ ప్రయాణికులకూ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ పాస్ లతో సగం ధరకే రోజూ ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రూట్ పాస్ లు పొందేందుకు టీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో దాదాపు 1.50 లక్షల జనరల్ బస్ పాసులు ఉన్నాయి. వీటిలో మెట్రో పాసులు 1.25 లక్షలు కాగా ఆర్డినరీ పాసులు 25 వేలు మాత్రమే. వీటితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో, పల్లె వెలుగులో కలిపి మరో 5 వేల పాస్ లు ఉన్నాయి.


More Telugu News