నమీబియా, దక్షిణాఫ్రికాకు చీతా ప్రాజెక్టు అధికారులు

  • అధ్యయనం కోసం అధికారులను పంపిస్తామన్న అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
  • జూన్ 6న కునో పార్కును సందర్శిస్తానన్న కేంద్రమంత్రి
  • చీతా కూనల మరణాలు తనను కదిలించాయన్న మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన చీతాలు వరుసగా మరణిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చీతాల పునరుజ్జీవ ప్రణాళికలో భాగమైన అధికారులను అధ్యయనం కోసం నమీడియా, దక్షిణాఫ్రికా పంపుతామని పేర్కొన్నారు. 

నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌ను జూన్ 6న సందర్శిస్తానని తెలిపారు. చీతాల భద్రత, పరిరక్షణ, పునరుద్ధరణ కోసం డబ్బు, అవసరమైన లాజిస్టిక్స్ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
 
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆరు చీతాలు కునో నేషనల్ పార్క్‌లో ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో మూడు కూనలు, మూడు పెద్ద చీతాలు ఉన్నాయి.  చీతా కూనలు మరణించడం తనను కలచివేసిందని సీఎం చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచంలో చీతా కూనల మనుగడ రేటు తక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినా వాటిని రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.


More Telugu News