భారత్‌కు పెరుగుతున్న మాల్‌వేర్ ముప్పు

  • అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో వెల్లడి
  • 2022లో దేశంలో 31 శాతం మేర పెరిగిన మాల్‌వేర్ దాడులు
  • ర్యాన్‌సమ్‌వేర్ దాడుల్లో 53 శాతం పెరుగుదల 
  • కొత్త టార్గెట్లను ఎంచుకుంటూ తమ పరిధి విస్తరించుకుంటున్న సైబర్ నేరగాళ్లు
  • వీరిని దీటుగా ఎదుర్కొనేలా నైపుణ్యాలు పెంచుకోవాలని సంస్థలకు సోనిక్‌వాల్ సూచన
భారత్‌కు సైబర్ దాడుల ముప్పు గణనీయంగా పెరిగిందని అమెరికా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్‌వాల్ తాజాగా పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, భారత్‌కు మాల్‌వేర్‌ దాడుల ముప్పు ఇటీవల కాలంలో అధికమైంది. 2022లో ఈ దాడుల సంఖ్య ఏకంగా 31 శాతం మేర పెరిగింది. అంతేకాకుండా, ర్యాన్‌సమ్‌దాడులు కూడా 53 శాతం మేర పెరిగాయి. 

భారత్‌ వంటి దేశాల్లో నిందితులు కొత్త టార్గెట్లను ఎంచుకుంటూ తమ పరిధిని విస్తరిస్తున్నారని ‘సోనిక్‌వాల్’ పేర్కొంది. కొత్త టార్గెట్ల కోసం నిరంతర అన్వేషణలో ఉంటున్న నిందితులు ఒకసారి విజయం సాధించాక పదే పదే అవే తరహా దాడులు చేస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేబాశీష్ ముఖర్జీ పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల నేరరీతులపై అవగాహన పెంచుకుంటూ, దాడులను తిప్పికొట్టగలిగేలా నైపుణ్యాలను సంస్థలు అభివృద్ధి పరుచుకోవాలని సూచించారు. 

ప్రస్తుతం అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సేవల మార్కెట్ పరిమాణం 173.5 బిలియన్ డాలర్లుగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో ఏటా 8.9 శాతం వృద్ధి నమోదవుతోందని చెప్పారు.


More Telugu News