చలానా విధించిన పోలీసులపై విద్యుత్ శాఖ లైన్‌మన్ ప్రతీకారం!

  • ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో వెలుగు చూసిన ఘటన
  • హెల్మెట్ పెట్టుకోని కారణంగా విద్యుత్ శాఖ లైన్‌మన్‌పై రూ.1000 జరిమానా
  • తాను విధి నిర్వహణపై వచ్చానని లైన్‌మన్ చెప్పినా వినని పోలీసులు
  • రెచ్చిపోయిన లైన్‌మన్, విద్యుత్‌లైన్లు కత్తిరించి పోలీస్ లైన్స్‌కు విద్యుత్ సరఫరా నిలివేత
  • ఎండలకు తాళలేక పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఇక్కట్లపాలు 
హెల్మెట్ పెట్టుకోని కారణంగా తనపై చలానా విధించిన పోలీసులకు చుక్కలు చూపించాడో లైన్‌‌మన్. కరెంట్ స్తంభం ఎక్కి వైర్లు కత్తిరించి పోలీస్ లైన్స్ మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో, ఎస్పీ సహా పలువురు పోలీసుల ఇళ్లల్లోని వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 

మీరట్ కు చెందిన ఖలీద్ విధి నిర్వహణలో భాగంగా హాపూర్‌కు బైక్‌పై వచ్చాడు. అయితే, అతడు హెల్మెట్ పెట్టుకోని కారణంగా పోలీసులు చలానా విధించారు. తాను విద్యుత్ ఉద్యోగినని, విధి నిర్వహణపై వచ్చానని అతడు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదట. చట్టం ముందు అందరూ సమానమేనంటూ రూ.1000ల చలానా విధించారట. 

దీంతో కోపోద్రిక్తుడైన ఖలీద్ స్థానికంగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఎండలకు తాళలేక జిల్లా ఎస్పీ సహా అనేక మంది పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఖలీద్ కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనపై విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ ఇంకా స్పందించలేదు.


More Telugu News