ఐపీఎల్ ఫైనల్లో... సాయి సుదర్శన్ సర్ ప్రైజ్ హిట్టింగ్

  • అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ 
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసిన గుజరాత్
  • 47 బంతుల్లో 96 రన్స్ చేసిన సాయి సుదర్శన్
  • 8 ఫోర్లు, 6 సిక్సర్లతో హోరెత్తించిన యువ కెరటం
ఐపీఎల్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. 

శుభ్ మాన్ గిల్ మరోసారి అదరగొడతాడా, సాహా రెచ్చిపోతాడా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా హార్డ్ హిట్టింగ్ చేస్తాడా అనే రీతిలో అంచనాలు కొనసాగగా... ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 

మొదట మామూలుగా బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక్కసారిగా గేర్లు మార్చి బాదుడు మొదలుపెట్టాడు. దాంతో చెన్నై బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసిన సాయి సుదర్శన్ అక్కడ్నించి రాకెట్ వేగంతో 90ల్లోకి చేరుకున్నాడు. 

చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్ లు కొట్టిన సాయి సుదర్శన్... పతిరణ వేసిన యార్కర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 21 ఏళ్ల సాయిసుదర్శన్ మొత్తం 47 బంతులాడి 96 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. 

అంతకుముందు, గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ రెండు క్యాచ్ లు వదిలాడు. లైఫ్ లభించడంతో గిల్, సాహా భారీ షాట్లు కొట్టారు. సాహా 54, గిల్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో సీఎస్కే ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ కు ఈజీగా పరుగులు లభించాయి. సీఎస్కే బౌలర్లలో పతిరణ 2, దీపక్ చహర్ 1, జడేజా 1 వికెట్ తీశారు. జడేజా బౌలింగ్ లో గిల్ ను ధోనీ స్టంపౌట్ చేసిన తీరు అమోఘం. బంతిని ఆడేందుకు గిల్ కొద్దిగా ముందుకు రాగా, మెరుపు వేగంతో స్పందించిన ధోనీ స్టంపౌట్ చేశాడు.


More Telugu News