తిరుమల ఘాట్ రోడ్లపై రెండు ప్రమాదాలు... 13 మందికి గాయాలు

  • తిరుమల ఘాట్ రోడ్డులో తరచుగా ప్రమాదాలు
  • తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో బోల్తాపడిన టెంపో వాహనం 
  • క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించిన అధికారులు 
  • రెండో ఘాట్ రోడ్ లో ఆర్చిని ఢీకొట్టిన కారు 
తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ టెంపో వాహనం తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్ ద్వారా తిరుపతికి వస్తుండగా ఆరో మలుపు వద్ద రెయిలింగ్ వాల్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిని కర్ణాటకలోని కోలార్ కు చెందిన భక్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని బర్డ్ హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరో ప్రమాదంలో తిరుమల కొండపైకి వస్తున్న కారు రెండో ఘాట్ రోడ్డులో ఆర్చిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘాట్ రోడ్లపై తాజా ప్రమాదాల నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. వరుస ప్రమాదాలపై నివేదిక రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఘటనలపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


More Telugu News