కాలుస్తావా? ఎక్కడికి రావాలో చెప్పు? మా గుండెల్లో కాల్చు: తమను బెదిరించిన రిటైర్డ్ ఐపీఎస్ కు బజరంగ్ పునియా సవాల్

  • అవసరమైతే మీపై కాల్పులు జరుపుతారంటూ రిటైర్డ్ ఐపీఎస్ ఆస్తానా ట్వీట్
  • బస్తా చెత్తను పడేసినట్లే.. రెజ్లర్లను లాగి పడవేస్తామని వ్యాఖ్య
  • బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ రెజ్లర్లు ఎదుర్కొన్నారన్న బజరంగ్ పునియా
  • ఇక మిగిలింది అవొక్కటేనని, ఎక్కడికి రావాలో చెప్పాలని చాలెంజ్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా టాప్‌ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో వారంతా ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పందించిన ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పునియా.. దీటుగా సవాల్ విసిరారు. 

దమ్ముంటే తమపై కాల్పులు జరపాలని పోలీసులతో పునియా అన్నారన్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ట్వీట్ చేశారు. ‘‘అవసరమైతే మీపై కాల్పులు జరుపుతారు. అంతేతప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129.. పోలీసులకు కాల్చులు జరిపే అధికారాన్ని ఇస్తుంది. పరిస్థితులు డిమాండ్ చేస్తే ఆ ‘కోరిక’ నెరవేరుతుంది. అందుకే మీరు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ ట్వీట్ పై బజరంగ్ పునియా స్పందించారు. ‘‘మమ్మల్ని కాల్చిచంపడం గురించి ఈ ఐపీఎస్ అధికారి మాట్లాడుతున్నారు. సోదరా.. మేం మీ ముందే ఉంటాం. ఎక్కడికి రావాలో చెప్పు. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ రెజ్లర్లు ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అవొక్కటే.. తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.


More Telugu News