కాంగ్రెస్‌ లో ఒవైసీ లాంటి మగాడెవరూ లేరా?.. అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

  • తెలంగాణలో మజ్లిస్ పేరు జపం చేయటమే బీజేపీ పనిగా పెట్టుకొందన్న ఒవైసీ
  • కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపిస్తోందని మండిపాటు
  • నిజంగా తమ చేతిలో ఉంటే సెక్రటేరియట్‌ను తాజ్‌మహల్‌ లా నిర్మించేవాడినని వ్యాఖ్య
  • తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు ఉన్నాయని వెల్లడి
  • గుజరాత్ లోని హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే కొత్త సెక్రెటేరియట్ నిర్మించారన్న ఎంఐఎం చీఫ్  
కాంగ్రెస్‌ లో ఒవైసీ లాంటి మగాడెవరూ లేరా? అంటూ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అస్తిత్వం కోల్పోతోందని, ఆ పార్టీని అందరూ వీడుతున్నారని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రతి నియోజకవర్గంలో రామ మందిరాలు నిర్మిస్తామని చెబుతున్నారని, హజ్ కు వెళ్లే వాళ్లపై కాంగ్రెస్ హయాంలోనే రాళ్లు రువ్వారని ఆరోపించారు.

‘‘నాన్ సెక్యులర్ బీజేపీ.. మజ్లిస్ పై ఆరోపణలు చేస్తోంది. అమిత్ షా ఇక్కడికొచ్చి కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపణలు చేశారు. తెలంగాణలో మజ్లిస్ పేరు జపం చేయటమే బీజేపీ పనిగా పెట్టుకొంది. తెలంగాణ కొత్త సచివాలయం ఒవైసీ ఆనందం కోసమేనట’’ అని ఎద్దేవా చేశారు. తన చేతిలోనే స్టీరింగ్‌ ఉంటే సెక్రటేరియట్‌ను తాజ్‌మహల్‌ మాదిరిగా నిర్మించేవాడినని అన్నారు. గుజరాత్ లోని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే కొత్త సెక్రటేరియట్ నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆనందం కేవలం మసీద్ లోనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

‘‘మసీదు కూల్చిన చోట కొత్తది నిర్మించలేదు. కానీ సెక్రటేరియట్ పూర్తయింది. గచ్చిబౌలీలో ఇస్లామిక్ సెంటర్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కానీ బ్రాహ్మణ్ సదన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రాహ్మణ్ సదన్ ప్రారంభోత్సవానికి దక్షిణ భారతంలోని అన్ని ప్రముఖ మఠాధిపతులను ఆహ్వానించారు. రూ.2,500 కోట్ల నిధులు తెలంగాణలో మందిరాల కోసం ఖర్చు చేశారు’’ అని అసదుద్దీన్ ఆరోపించారు.

ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు ఉన్నాయన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. తన పేరు చెప్పుకొని బీజేపీ కడుపు నింపుకోవాలనుకుంటే తనకు అభ్యంతరంలేదని ఎద్దేవా చేశారు. అమిత్ షాకు తానంటే భయమని అన్నారు. మజ్లిస్ ను బలహీన పరిచే శక్తి దేశంలో ఎవరికీ లేదన్నారు. అమిత్ షా చెప్పులు మోసే బీజేపీ నాయకులు కూడా మజ్లిస్ పై మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముస్లింల అభివృద్ధి నిధులపై ఏడ్చేవాళ్లు తమ తండ్రి, తాతల ఆస్తులిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ‘‘మేముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు గుర్తుంచుకొండి. రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో త్వరలో వెల్లడిస్తాం. స్టీరింగ్ నా చేతిలోనే ఉందంటున్నారు.. యాక్సిండెంట్ చేస్తానేమో’’ అంటూ వ్యాఖ్యానించారు.

లోక్ సభలో ప్రధాని వెంట పదుల సంఖ్యలో హిందూ పూజారులు ఉన్నారని తెలిపారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. రాజరిక రాజ్యాభిషేకంలా కనిపించిందని అన్నారు. మోదీని మించిన నటులెవరూ లేరని, 9 ఏళ్లుగా అద్భుతంగా నటిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News