మహిళల్లోనే కిడ్నీ సమస్యలు ఎక్కువ.. ఎందుకని?

  • ఎక్కువ మందిలో కిడ్నీల్లో రాళ్లు
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్
  • సకాలంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు డ్యామేజ్
కిడ్నీ సమస్యలు, ముఖ్యంగా 30 ఏళ్లకే మహిళల్లో పెరిగిపోతున్నాయి. దీనిపై ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. మహిళల్లో కిడ్నీ సమస్యలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. 

కిడ్నీల్లో రాళ్లు
కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఎక్కువ మంది మహిళల్లో కనిపిస్తుంది. హార్మోన్లలో ఏర్పడే మార్పులు, ఆహార అలవాట్లు, జన్యువుల స్థితి కిడ్నీలో రాళ్లకు కారణం కావచ్చు. నడుము భాగంలో ఒకవైపు నొప్పి వస్తుంది. లేదంటే కడుపులోనూ రావచ్చు. మూత్రంలో రక్తం పడడం, తరచూ మూత్ర విసర్జన ఇవన్నీ సంకేతాలుగా భావించాలి. దీనికి నివారణగా తగినంత నీటిని తాగాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం, స్థూలకాయం కూడా కిడ్నీల్లో రాళ్ల సమస్యకు దారితీస్తాయి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతింటాయి. బ్యాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో, ఆ తర్వాత మంట అనిపిస్తుంది. జననాంగాలపై నొప్పి వస్తుంది. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి.

పాలీ సిస్టిక్ కిడ్నీ డిసీజ్
ఇది జన్యుపరంగా వచ్చే సమస్య. కిడ్నీలో ఎన్నో సిస్ట్ లు ఏర్పడతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సమస్య రావచ్చు. కడుపులో నొప్పి, అధిక రక్తపోటు, మూత్రంలో మంట ఈ సమస్యకు సంకేతాలు. చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతింటాయి.

క్రానిక్ కిడ్నీ డిసీజ్
ఇది చాలా తీవ్రమైన సమస్యే. నిర్ణీత కాలంలో కిడ్నీల పనితీరును మార్చేస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, వ్యాధి నిరోధక శక్తి సమస్యలు క్రానిక్ కిడ్నీ డిసీజ్ కు దారితీస్తాయి. హార్మోన్లలో మార్పుల వల్ల కూడా సమస్య రావచ్చు.

ప్రధాన రిస్క్ లు
రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వీటివల్ల కిడ్నీల్లో సమస్యలు కనిపిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ వీటిని నియంత్రించుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.


More Telugu News