రాజదండం.. తొలి రోజే వంగిపోయింది: కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు
- రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించిన స్టాలిన్
- కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున ఈ దారుణం జరగడం న్యాయమేనా అని ప్రశ్న
- డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపాటు
పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్ఠించిన చారిత్రాత్మక ‘సెంగోల్ (రాజదండం)’ తొలిరోజే వంగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎద్దేవా చేశారు. అలాగే, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శించారు.
న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని, డబ్ల్యూఎఫ్ఐ (వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్) చీఫ్, ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఎంపీపై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసి చాలా రోజులైంది. ఆయనపై బీజేపీ, కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళా రెజ్లర్లు రాజధానిలో పోరాడుతూనే ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకోవడం ఖండించదగ్గ విషయం. ఈ ఘటనతో సెంగోల్ మొదటిరోజే వంగిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతిని కూడా విస్మరించి.. ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య నిర్వహించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా?’’ అని ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకుని, వీరిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతోపాటు ఇతర నిరసనకారులపై కేసులు నమోదు చేశారు.