కెనడాలో భారత సంతతి గ్యాంగ్ స్టర్ కాల్చివేత

  • వివాహ వేడుకలో పాల్గొన్న గ్యాంగ్ స్టర్ పై దుండగుడి కాల్పులు
  • అతిథులు డ్యాన్స్ చేస్తుండగా లోపలికి వచ్చిన ఆగంతుకుడు
  • సీపీఆర్ చేసి గ్యాంగ్ స్టర్ ను కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులు
కెనడాలో తప్పించుకు తిరుగుతున్న భారత సంతతి గ్యాంగ్ స్టర్ ను దుండగులు కాల్చి చంపారు. ఆదివారం వాంకోవర్ సిటీలో జరిగిన వివాహా వేడుకల్లో పాల్గొన్న గ్యాంగ్ స్టర్ అమర్ ప్రీత్ సామ్రపై కాల్పులు జరపడంతో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు సీపీఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అంబులెన్స్ వచ్చే లోపే అమర్ ప్రీత్ ఊపిరి ఆగిపోయింది. కాగా, అమర్ ప్రీత్ కెనడా పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్న నేరస్థుడని, ఆయన సోదరుడు రవీందర్ కూడా గ్యాంగ్ స్టరేనని అధికారులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వివాహ వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాటు చేయగా కొంతమంది అతిథులు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఓ ఆగంతుకుడు లోపలికి వచ్చి డీజే ఆపాల్సిందిగా కోరాడు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే అమర్ ప్రీత్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అమర్ ప్రీత్ కు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని, తీవ్ర గాయాలతో అమర్ ప్రీత్ చనిపోయాడని చెప్పారు. కాగా, ఈ హత్యకు కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.


More Telugu News