ఎంఎస్ ధోనీపై కీలక వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్

  • ధోనీని జీవితాంతం ఆడాలని కోరుకుందామా? అంటూ ప్రశ్న
  • ఇంత కాలం సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పాలన్న అభిప్రాయం
  • తన జట్టును ఫైనల్ కు చేర్చాడని ప్రశంస
  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయమై దిగ్గజ భారత క్రికెటర్లలో ఒకరైన కపిల్ దేవ్ తన అభిప్రాయాలను బహిరంగంగా షేర్ చేశారు. ధోనీ క్రికెట్ కోసం తన వంతు సేవలను అందించినట్టు చెబుతూ, అతడి రిటైర్మెంట్ పై చర్చ అనవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ అంతటా ధోనీ రిటైర్మెంట్ ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిపోవడం తెలిసిందే. ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. ధోనీ సైతం స్పందిస్తూ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడానికి తనకు మరో 8 నెలల సమయం ఉందని, ఈ ఏడాది డిసెంబర్ లో కానీ వేలం ఉండదని ప్రకటించడం వినే ఉంటారు. 

ఈ తరుణంలో కపిల్ దేవ్ (1983లో భారత్ కు ప్రపంచ కప్ తెచ్చిన సారథి) ఈ అంశంపై గట్టిగానే స్పందించారు. ‘‘అతడు (ధోనీ) ఐపీఎల్ కోసం 15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు. మనం కేవలం ధోనీ గురించే ఎందుకు మాట్లాడుతుంటాం? అతడు తనవంతు సేవలు అందించాడు. అతడి నుంచి మనం మరింతగా ఆశించేది ఏముంది? అతడ్ని జీవితాంతం ఆడాలని మనం కోరుకుందామా? అది జరగదు. దీనికి బదులు 15 ఏళ్లు ఆడినందుకు ధన్యవాదాలు చెప్పాలి. వచ్చే ఏడాది అతడు ఆడడం, ఆడకపోవడం గురించి మనకు తెలియదు. అతడు వెళ్లిపోవడానికి ముందు అతడు ఎంతో మెచ్చుకోతగిన ప్రదర్శన ఇచ్చాడు. అతడు పెద్ద స్కోర్లు సాధించలేకపోవచ్చు. కానీ, అతడు తన టీమ్ ను ఫైనల్ కు చేర్చాడు. క్రికెట్ లో కెప్టెన్ కు ఎంత ప్రాధాన్యం ఉందో ఇది తెలియజేస్తోంది’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.


More Telugu News