అమిత్ షా పర్యటనకు ముందు మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి

  • ఘర్షణల్లో ఇప్పటి వరకు 80 మంది మృత్యువాత
  • సెరౌ, సుగుణు ప్రాంతాల్లోని ఇళ్లపై ఉగ్రవాదుల తూటాల వర్షం
  •  నెల రోజులుగా అట్టుడుకుతున్న మణిపూర్
మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కేంద్రమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మరోమారు అల్లర్లు రేకెత్తాయి. ఈ ఘటనలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 80కి పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు సెరౌ, సుగుణు ప్రాంతాల్లోని పలు ఇళ్లపై తూటాల వర్షం కురిపించినట్టు పేర్కొన్నారు. 

కాగా, గత రెండు రోజుల్లో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ముుఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇంఫాల్ లోయలోని శివారు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పౌరులపై జరుగుతున్న హింసాత్మక దాడులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఘర్షణలకు కారణమైన మెయిటీ, కుకీ తెగలను సంయమనం పాటించాలని కోరారు. 

రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు తీసుకున్న చర్యలపై ఇటీవల షా సమీక్షించారు. మెయిటీ, కుకీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కాగా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా శనివారం మణిపూర్‌ను సందర్శించి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. తమను ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న మెయిటీ తెగ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కుకీ తెగలు ఆందోళనకు దిగడంతో గత నెలలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్ఠాన్ని తలపిస్తోంది.


More Telugu News