ఎన్వీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
- శాటిలైట్ ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్
- శ్రీహరికోట అంతరిక్షకేంద్రం నుంచి ప్రయోగం చేపట్టిన ఇస్రో
- సుమారు 20 నిమిషాల పాటు కొనసాగిన ప్రయోగం
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. తాజా ప్రయోగంతో భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. కాగా, జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు కాగా, ఎన్వీఎస్-01 ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఉపగ్రహం జీవిత కాలం 12 సంవత్సరాలు.
ప్రయోగం జరిగిందిలా..
ప్రయోగం జరిగిందిలా..
- ఆదివారం ఉదయం 7:12 గంటలకు జీఎస్ఎల్వీ- ఎఫ్ 12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.
- షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.
- 27:30 గంటలు కొనసాగిన కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ నింగికెగిరింది.
- దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన ప్రయాణం తర్వాత ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.