అమెజాన్ ప్రైమ్ లో 'నీలవేలిచం' .. ఈ దెయ్యం కథలో కొత్తగా చెప్పిందేంటి?

  • ఏప్రిల్ 20న థియేటర్లకు వచ్చిన 'నీలవేలిచం'
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సినిమా 
  • ఒక రచయితకు .. ప్రేతాత్మకు మధ్య జరిగే కథ  
  • నిదానంగా నడిచే కథనం..  ఫోటోగ్రఫీనే ప్రధాన బలం    
అటు నార్త్ లోను .. ఇటు సౌత్ లోను ఇంతకుముందు హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. దెయ్యంగా మారిన ఒక యువతి ఇతరులను ఆవహించి తాను అనుకున్న దానిని సాధిస్తూ ఉంటుంది. చివరికి ఆ దెయ్యాన్ని మంత్రశక్తితో కట్టడి చేయడం .. పేతాత్మను బంధించి తేలికగా ఊపిరి పీల్చుకోవడం దిశగానే చాలా కథలు కనిపిస్తాయి. కానీ అందుకు భిన్నంగా వచ్చిన మలయాళ సినిమాగా 'నీలవేలిచం' కనిపిస్తుంది. 

టోవినో ధామస్ .. రీమా .. షైన్ టామ్ చాకో ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆషిక్ అబూ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 20వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సినిమాలో హీరో ఓ రచయిత .. తనకంటూ ఎవరూ లేని ఒంటరి. ఆయన ఒక కథను రాయడం కోసం .. సముద్రతీరంలోని ఒక గ్రామానికి వెళతాడు. 'భార్గవి నిలయం' అనే ఒక పాడుబడిన ఇంట్లో దిగుతాడు. తాను ఉండటానికి అనువుగా ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటాడు. 

ఊళ్లో వాళ్లంతా అతనిని అదోలా చూస్తుంటారు. తానున్న ఇంట్లో దెయ్యం ఉందనీ .. భార్గవి అనే యువతి ఆ ఇంట్లోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుంటాడు. ప్రేమికుడి చేతిలో మోసపోవడమే అందుకు కారణమనీ, ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన పురుషులను చంపకుండా వదలదని వింటాడు. భార్గవి ఎందుకు చనిపోయింది? అందుకుగల కారణాలు ఏమిటి? అనేది తెలుసుకుని ఒక పుస్తకం రాయాలని అతను అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉన్న అతనికి ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. 

ఈ కథ చాలా నిదానంగా నడుస్తుంది. ఇతర హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే సన్నివేశాల వంటివి ఈ సినిమాలో కనిపించవు. సహజత్వానికికి దగ్గరగా ఈ కథ ముందుకు వెళుతుంది. కథాకథనాలు .. టోవినో థామస్ నటన పక్కన పెడితే, ఫొటోగ్రఫీ కోసం ఈ సినిమా చూడొచ్చు. అద్భుతమైన ఫొటోగ్రఫీ చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది. ఆ తరువాత మార్కులు సంగీతానికి పడతాయి. ఒక దెయ్యం కథను కొత్త కోణంలో చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. స్క్రీన్ ప్లేలో వేగం వైపు నుంచి కాకుండా, విజువల్స్ పరంగా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. 




More Telugu News