మహిళ గొలుసును మింగేసిన దొంగ.. కాపాడాలంటూ పోలీసులకు వేడుకోలు

  • ఝార్ఖండ్‌లో ఇటీవల వెలుగు చూసిన ఘటన
  • ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో గొలుసు తెంపుకుని వెళ్లిపోయిన దొంగలు
  • మహిళ ఆర్తనాదాలు విని నిందితులను వెంబడించిన పోలీసులు
  • తాము దొంగతనం చేయలేదని నిరూపించుకునేందుకు గొలుసు మింగేసిన దొంగ
  • దొంగ ఛాతిలో ఇరుక్కున్న గొలుసు తొలగించకపోతే అపాయం తప్పదన్న వైద్యులు 
పోలీసులను తప్పుదారి పట్టించేందుకు చోరీ చేసిన గొలుసును మింగేసిన ఓ దొంగ చివరకు ప్రాణభయంతో పోలీసులను శరణువేడుకున్నాడు. ఛాతి భాగంలో ఇరుక్కుపోయిన గొలుసును బయటకు తీయించమంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. ఝార్ఖండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

 సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు ఇటీవల స్థానిక దిబ్దిహ్ వంతెన సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళను టార్గెట్ చేశారు. వేగంగా బైక్‌పై వచ్చిన వారు ఆమె మెడలో గొలుసు తెంపుకుని వెళ్లిపోయారు. మహిళ పెద్ద పెట్టున కేకలు వేయడంతో పోలీసులు అప్రమత్తమై దొంగలను వెంబడించారు. అయితే, తాము గొలుసు చోరీ చేయలేదని నిరూపించుకునేందుకు సల్మాన్, ఆ గొలుసును మింగేశాడు. 

ఇదంతా గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఛాతిలో గొలుసు ఇరుక్కున్న విషయాన్ని గుర్తించిన వైద్యులు వెంటనే దాన్ని బయటకు తీయకపోతే ఇన్ఫెక్షన్ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది విన్న దొంగకు ప్రాణభయం పట్టుకోవడంతో తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు. రాంచీలో ఒంటరిగా వీధుల్లో వెళ్లే మహిళలే టార్గెట్‌గా సల్మాన్, జాఫర్‌లు చోరీ చేస్తుంటారని పోలీసులు తెలిపారు.


More Telugu News