రజనీకాంత్‌ కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే: రామ్ గోపాల్ వర్మ

  • ఎన్టీఆర్ ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే మగాడన్న రామ్ గోపాల్ వర్మ
  • తారక్‌కు తాను థ్యాంక్స్‌ చెప్తున్నానని వెల్లడి 
  • ఎన్టీఆర్ ను చంపినవాళ్లే ఇప్పుడు అభిషేకాలు చేస్తున్నారని ఆరోపణ
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్‌ మరొకటి లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘మీకు ఒక సీరియస్‌ జోక్‌ చెప్పడానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్‌ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్‌ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్‌. అల్లుడైన వ్యక్తి ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్‌ చేసి, ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్‌’’ అని ఆరోపించారు.  

ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేశారని ఆర్జీవీ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని చాలామంది అంటున్నారు. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. రజనీకాంత్‌ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగిడారని, ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లేనని ఆరోపించారు.

‘‘నందమూరి తారక రామారావుగారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. తారక్‌ ఒక్కడే తాత మీద ఉన్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్‌కు నేను థ్యాంక్స్‌ చెప్తున్నా’’ అని అన్నారు.


More Telugu News