ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారికి గర్వకారణం: పవన్ కల్యాణ్

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నివాళులు
  • తన తరపున, జనసేన శ్రేణుల తరపున నీరాజనాలు అర్పిస్తున్నట్టు పేర్కొన్న జనసేనాని
  • తెలుగు వారి సత్తాను ఎన్టీఆర్ ఢిల్లీకి చాటారన్న పవన్
సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగు వారికి గర్వకారణమని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్టు పేర్కొన్న పవన్.. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి తన తరపున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

‘’చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడిపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన శతజయంతి సందర్భాన అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది. ఎందరికో అనుసరణీయమైనది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మగౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీదాకా చాటారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఎన్.టి.రామారావు గారు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్యదినాన ఆ మహనీయుడికి  నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.



More Telugu News