నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు

  • రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత
  • తూర్పుగోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • నేడు, రేపు పలు మండలాల్లో వడగాడ్పులకు అవకాశం
  • ద్రోణి ప్రభావంతో చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
భానుడి ప్రతాపానికి ఏపీ అల్లాడుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. శనివారం తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. 

ఆదివారం 73 మండలాల్లో, సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరులో అత్యధికంగా 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే, ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్, తదితర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.


More Telugu News