ఎన్టీఆర్ బ్యానర్ల వార్: విజయవాడలో గద్దె రామ్మోహన్ వర్సెస్ దేవినేని అవినాశ్

  • రేపు ఎన్టీఆర్ జయంతి
  • విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో బ్యానర్లు కట్టిన దేవినేని అవినాశ్
  • మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
  • ఎన్టీఆర్ బ్యానర్లు కట్టే అర్హత అవినాశ్ కు లేదన్న రామ్మోహన్ 
రేపు ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవినేని అవినాశ్ బ్యానర్లు కట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. 

దీనిపై దేవినేని అవినాశ్ స్పందిస్తూ, తాము కూడా ఎన్టీఆర్ అభిమానులమేనని, ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. ధనబలం, ఎల్లో మీడియా అండతో ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తాము బ్యానర్లు కట్టే వరకు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. 

అటు, దేవినేని అవినాశ్ చర్యలను ఖండిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు పసుపు జెండాలు కట్టారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ, దేవినేని అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూకు ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న మాట అందరూ అంగీకరిస్తారని, చనిపోయినవేళ దేవినేని నెహ్రూ పార్థివ దేహంపై టీడీపీ జెండానే కప్పారని వివరించారు. 

కానీ, దేవినేని అవినాశ్ టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని, పార్టీ జెండాను అత్యంత అవమానకర రీతిలో కింది వేసి తొక్కారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు అవినాశ్ ఎందుకు మాట్లాడలేదని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. ఇలాంటి నేపథ్యంలో, ఎన్టీఆర్ విగ్రహం వద్ద వారి బ్యానర్లకు స్థానం లేదని, రౌడీయిజం, ధనబలంతో ఏమైనా చేయొచ్చని అనుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.


More Telugu News