ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. ‘సారే జ‌హా సె అచ్చా’ పాట రాసిన కవిపై చాప్ట‌ర్‌ తొలగింపు!

  • డీయూలో బీఏ ఆరో సెమిస్ట‌ర్ లో మహమ్మద్ ఇక్బాల్ ప్రస్తావన
  • సిలబస్ నుంచి తొలగించాలని వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ తీర్మానం
  • దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన వారి గురించి సిలబస్‌లో ఉండకూడదన్న వీసీ యోగేశ్ సింగ్ 
  • జూన్ 9న తుది నిర్ణయం తీసుకోనున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
పాకిస్థాన్ జాతీయ కవి మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌ కు సంబంధించిన చాప్టర్ ను పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. డీయూలో బీఏ ఆరో సెమిస్ట‌ర్ పేప‌ర్‌లో ‘మోడ్ర‌న్ ఇండియ‌న్ పొలిటిక‌ల్ థాట్’ అనే చాప్ట‌ర్‌ ఉంది. అందులోనే ఇక్బాల్ గురించిన ప్రస్తావన ఉంది.

ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మీటింగ్ లో ఇక్బాల్ చాప్టర్ గురించిన చర్చ జరిగింది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన వారి గురించి సిలబస్‌లో ఉండకూడదని వీసీ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ చాప్ట‌ర్ తొల‌గించాల‌న్న తీర్మానం తర్వాత వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుకు వస్తుందని అధికారులు చెప్పారు. తుది నిర్ణ‌యాన్ని జూన్ 9 జరిగే సమావేశం సందర్భంగా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. 

మహమ్మద్ ఇక్బాల్ గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ ఆయన రాసిన గీతం ఇప్పటికీ మనం ఆలపిస్తూనే ఉన్నాం. ‘సారే జహా సె అచ్ఛా హిందూస్థాన్ హమారా’ అంటూ పాడుకుంటూనే ఉన్నాం. ఈ దేశభక్తి గీతాన్ని రచించిన మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌.. పాకిస్థాన్ జాతీయ క‌వి. అవిభా‌జిత భార‌త‌దేశంలో 1877లో ఆయ‌న సియాల్‌కోట్‌లో జ‌న్మించారు.

యూనివ‌ర్సిటీ మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏబీవీపీ స్వాగ‌తించింది. ‘‘పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాల‌న్న ఐడియా ఇక్బాల్ దే. పాకిస్థాన్ త‌త్వ‌వేత్త‌గా మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌కు గుర్తింపు ఉంది. ముస్లిం లీగ్‌లో జిన్నాను కీల‌క నేత‌గా తీర్చిదిద్ద‌డంలో ఇక్బాల్ ముఖ్య పాత్ర పోషించారు. భార‌త్ విభ‌జ‌న‌లో జిన్నాకు ఎంత బాధ్య‌త ఉందో, అంతే బాధ్య‌త ఇక్బాల్‌పై ఉంటుంది’’ అని ఏబీవీపీ చెప్పుకొచ్చింది.


More Telugu News