ఫేజ్ 1 ఎన్నికల మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తాం.. పీ4తో పేదలను ధనికులను చేస్తాం: చంద్రబాబు

  • స్కాంలు చేయడంలో జగన్ ది మాస్టర్ మైండ్ అన్న చంద్రబాబు
  • బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ఆవేదన
  • రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శ
వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పుడే సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికలు 2024లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా సైకిల్ రెడీగా ఉందని అన్నారు. గత నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఎంతో వేధిస్తున్నా టీడీపీ కార్యకర్తలు భయపడలేదని, వెనుకంజ వేయలేదని ప్రశంసించారు.  

దిశ చట్టమే లేకపోయినా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. అమ్మఒడి అనేది నాటకమని, నాన్నబుడ్డి వాస్తవమని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు అవసరమవుతాయని అన్నారు. జలజీవన్ మిషన్ లో మన రాష్ట్రం 18వ స్థానంలో, ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, అప్పుల్లో తొలి స్థానంలో, విదీశీ పెట్టుబడుల్లో 14వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ సహాయ నిరాకరణ చేశాయని అన్నారు. తిరుమలలో కూడా గంజాయి వ్యాపారం జరగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎక్కడో ఉండే అమూల్ ను ఇక్కడకు తెచ్చాడు మన అమూల్ బేబి జగన్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్కాంలు చేయడంలో జగన్ ది మాస్టర్ మైండ్ అని అన్నారు. ప్రజలను సర్వనాశనం చేయడానికే జగన్ వచ్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదని... అన్ని నోట్లు జగన్ దగ్గరే ఉన్నాయని తెలిపారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4 విధానంతో పేద వాడిని ధనికుడిని చేసేందుకు నాంది పలుకుదామని చంద్రబాబు అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించిన పనుల వలన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని... ఏపీలో విధ్వంసకర పాలన వలన చివర స్థానంలో ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. వైసీపీ పాలనలో కౌరవ సభగా మారిన అసెంబ్లీని మళ్లీ గౌరవ సభగా మారుద్దామని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం నాయకులు ప్రజలందరితో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.


More Telugu News