నిమ్స్‌కు వైఎస్ భాస్కర్ రెడ్డి తరలింపు

  • వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి
  • చంచల్‌గూడ జైలులో నిన్న అస్వస్థత
  • వైద్యుల సూచనతో ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తీసుకెళ్లిన అధికారులు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో  ప్రధాన వార్తగా మారింది. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందా? లేదా? అన్న ప్రశ్న హాట్ టాపిక్ అయింది. అవినాశ్ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 

మరోవైపు ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భాస్కర్ రెడ్డి నిన్న అస్వస్థతకు గురయ్యారు. అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దాంతో, భాస్కర్ రెడ్డిని ఈ రోజు నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉందని తేలితే ఆయనకు నిమ్స్‌లో వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ రిపోర్టులు నార్మల్‌గా ఉంటే ఆయనను తిరిగి చంచల్‌గూడ జైలుకు పంపించే అవకాశం ఉంది.


More Telugu News