తండ్రి సీఎం అయినప్పుడు చిల్లిగవ్వ లేక జగన్ ఇంటిని తాకట్టు పెట్టాడు: అచ్చెన్నాయుడు

  • సీఎం అయిన తర్వాత జగన్ 3 లక్షల కోట్లు దోచుకున్నాడన్న అచ్చెన్న 
  • ఇడుపులపాయలో భూమిలో డబ్బులు దాస్తున్నాడని ఆరోపణ 
  • వివేకా కేసులో జగన్ పేరును నిన్న సీబీఐ చెప్పిందని వ్యాఖ్య
ఎన్నికల్లో ఓడిపోతాననే విషయం జగన్ కు తెలిసిపోయిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే సభల్లో అన్నీ అబద్ధాలు చెపుతున్నారని... తనకు టీవీ లేదు, పేపర్ లేదు, బంగళా లేదు, తాను పేదవాడినని ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ ఒక్కడి ఆస్తి ఎక్కువని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఇంటిని తాకట్టు పెట్టిన జగన్... ఇప్పుడు దేశంలోనే సంపన్నుడైన సీఎం అని విమర్శించారు. 

ప్రజల మీద రకరకాల పన్నులు వేస్తూ అందరినీ కష్టాలపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం అయిన తర్వాత 3 లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ డబ్బులతో నిండిపోయిందని, దీంతో ఇప్పుడు డబ్బును ఇడుపులపాయకు తరలించి భూమిలో దాచిపెడుతున్నారని అన్నారు. వివేకాను చంపింది జగనే అని తాము ముందు నుంచి చెపుతున్నామని... నిన్న సీబీఐ కూడా జగన్ పేరును చెప్పిందని తెలిపారు. అవినాశ్ అరెస్ట్ అయితే ఆ తర్వాత కేసు తనపైకి వస్తుందని జగన్ భయపడుతున్నారని చెప్పారు. 

రూ. 2 వేల నోట్లన్నీ జగన్ నేలమాళిగల్లో ఉన్నాయని... ఇప్పుడు వాటిని మార్చుకోలేక తల్లడిల్లిపోతున్నాడని అన్నారు. మండుటెండల్లో కూడా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని చెప్పారు. మహానాడు కోసం టీడీపీ ఏర్పాటు చేసిన పోస్టర్లను జగన్ బ్లేడ్ బ్యాచ్ రాత్రి వచ్చి బ్లేడ్లతో కోసేసిందని మండిపడ్డారు.


More Telugu News