అవినాశ్ రెడ్డి సహకరించడం లేదు.. కస్టోడియన్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది: హైకోర్టులో సీబీఐ

  • అవినాశ్ ముందస్తు బెయిల్ పై టీఎస్ హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • విచారణను జాప్యం చేసి అవినాశ్ లబ్ధి పొందాలనుకుంటున్నారన్న సీబీఐ
  • అవినాశ్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని ఆరోపణ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. సీబీఐ ప్రధానంగా మూడు అంశాలపై వాదనలను వినిపిస్తోంది. వివేకా హత్యకు కుట్ర, అవినాశ్ రెడ్డి కస్టోడియల్ విచారణ, బెయిల్ నిరాకరణ అంశాలపై వాదిస్తోంది. 

అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, కేసు దర్యాప్తులో అడుగడుగునా అంతరాయాలు కలిగిస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టులో పిటిషన్లు వేస్తూ, విచారణలో జాప్యం కలిగేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని అనుకుంటున్నారని అన్నారు. విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని... సామాన్యుల విషయంలో అయితే ఇలాగే వ్యవహరిస్తారా? అని సీబీఐని కోర్టు ప్రశ్నించగా... సీబీఐ తరపు న్యాయవాది ఈ మేరకు కోర్టుకు తెలిపారు. 

అవినాశ్ కోరుకున్నట్టు తాము విచారణ జరపమని... తమ విధానం ప్రకారమే దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఈ కేసులో ఎంతో మందిని విచారించామని, కొందరిని అరెస్ట్ చేశామని తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పుడల్లా అవినాశ్ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదని చెప్పారు.  

అవినాశ్ కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని కోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని... రాజకీయ కోణంలోనే హత్య జరిగిందని చెప్పారు. వివేకాతో అవినాశ్ కుటుంబానికి రాజకీయ విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించేందుకు కుట్ర జరిగిందని అన్నారు. అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు. సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేశ్ వర్మ, వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కోర్టులో వాదనలను వింటున్నారు.



More Telugu News