డిన్నర్ కోసం బయటకు వచ్చిన హిందూ యువకుడు, ముస్లిం యువతిపై మూక దాడి

  • మధ్యప్రదేశ్ ఇండోర్‌‌ లో గురువారం రాత్రి ఘటన
  • జంటను వెంబడించి చుట్టుముట్టిన 20 మందితో కూడిన గుంపు
  • వారిని రక్షించేందుకు వచ్చిన ఇద్దరిపై కత్తిదాడి
ముస్లిం అమ్మాయి, హిందూ యువకుడిపై మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో మూక దాడి జరిగింది. శుక్రవారం రాత్రి  ఓ హోటల్ లో భోజనం చేసి బయటకు వచ్చిన ఈ ఇద్దరినీ ఓ వర్గానికి చెందిన 20 మందికి పైగా వ్యక్తులు వెంబడించారు. రహదారి మధ్యలో వారిని అడ్డుకున్నారు. తమ మత సంప్రదాయాలకు విరుద్ధంగా సదరు అబ్బాయితో ఎందుకు బయటికి వచ్చావంటూ అమ్మాయిని ప్రశ్నించారు. ఆ యువకుడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. 

ఈ సమయంలో మరికొందరు ఆ జంటకు మద్దతుగా వచ్చారు. గుంపు నుంచి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. జంటను రక్షించే ప్రయత్నం చేసినా వారిలో ఇద్దరిని ఆగంతుకులు కత్తితో పొడిచారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

వేరే మతానికి చెందిన వ్యక్తితో ఎందుకు వచ్చావని మహిళను ఆగంతుకులు ప్రశ్నించినట్లు అదనపు డీసీపీ రాజేష్ రఘువంశీ తెలిపారు. ‘తల్లిదండ్రులకు చెప్పే తాను ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని మహిళ తెలిపింది. తమను అడ్డగించిన గుంపు ప్రవర్తనపై ముస్లిం యువతి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపు నుంచి ఎవరో కత్తితో పొడవడంతో వారు గాయపడ్డారు' అని తెలిపారు. 

ఈ ఘటనపై ఐపీసీ 307కింద కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ శర్మ తెలిపారు. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో 20 మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, జంటను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.


More Telugu News