జూన్ లో వీటికి ముగిసిపోతున్న గడువు.. త్వరపడండి..!

  • పాన్-ఆధార్ లింకింగ్ కు జూన్ 30 వరకు గడువు
  • జూన్ 26 వరకు అధిక పింఛను ఆప్షన్ ఇచ్చుకోవచ్చు
  • బ్యాంకు లాకర్ల ఒప్పందాలపై తాజా సంతకాలు
కొన్ని ఆర్థిక సాధనాలు, గుర్తింపు పత్రాలకు సంబంధించి ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసిపోనుంది. ఇందులో పాన్ ఆధార్ లింక్ కూడా ఒకటి. ఇలాంటి ముఖ్యమైన వాటిని వెంటనే పూర్తి చేసుకోవడం వల్ల తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఏర్పడదు.

పాన్ ను ఆధార్ తో అనుసంధానించుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. కనుక పాన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ కు వెళ్లి ఆధార్ నంబర్ తో అనుసంధానించుకోవాలి. ఇప్పటికే పలు విడతలుగా ఈ గడువును పొడిగిస్తూ వచ్చారు. మరో విడత గడువు ఇస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. గడువు కోసం చూడకుండా లింక్ చేసుకోవడమే నయం. ఒకవేళ లింక్ చేసుకోకపోతే, గడువు పొడిగించకపోతే, జూన్ 30 తర్వాత పాన్ పనిచేయదు. పాన్ పని చేయకపోతే పెట్టుబడి సాధనాలతో లింక్ తెగిపోతుందని అనుకోవాలి. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల పరంగా కూడా సమస్య ఎదురుకావచ్చు.

అధిక పింఛను
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో సభ్యులైన వారు తమకు అధిక పింఛను కోరుకుంటే జూన్ 26 వరకు ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. మే 3 వరకు ఉన్న గడువును పొడిగించారు. 

ఆన్ లైన్ లో ఆధార్ అప్ డేట్
ఆధార్ కార్డు దారులు తమ వివరాలను ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ ఆఫర్ చేస్తోంది. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఈ అవకాశం కల్పించింది. ఆధార్ లో చిరునామా మార్చుకోవాలంటే ఉచితంగా చేసుకోవచ్చు. మైఆధార్ పోర్టల్ నుంచి ఉచితంగా చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకుంటే రూ.50 ఫీజు చెల్లించాల్సిందే. గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేయడం ద్వారా తమ డెమోగ్రాఫిక్ సమాచారాన్ని తిరిగి చెల్లుబాటు అయ్యేలా చేసుకోవచ్చని యూఐడీఏఐ సూచించింది. 

బ్యాంకు లాకర్ ఒప్పందాలు
లాకర్ ఒప్పందాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కనుక లాకర్ కలిగిన ఖాతాదారులతో తిరిగి తాజా ఒప్పందాలు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. 2023 డిసెంబర్ 31 నాటికి దశలవారీగా దీన్ని పూర్తి చేయాలని కోరింది. ముఖ్యంగా 50 శాతం లాకర్ల ఒప్పందాలను జూన్ 30 నాటికి తాజాగా కుదుర్చుకోవాలని ఆదేశించింది. కనుక లాకర్ ఉన్న వారు కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.


More Telugu News