వాళ్లు సలహాదారులు కాదు.. స్వాహాదారులు: తులసిరెడ్డి
- ఒక్కో సలహాదారుడికి నెలకు రూ. 5 లక్షలు ఖర్చవుతోందన్న తులసిరెడ్డి
- వాళ్లు సలహాలు ఇచ్చిందే లేదని విమర్శ
- వైసీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారిందని విమర్శ
ఏపీ ప్రభుత్వ సలహాదారులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వాళ్లు సలహాదారులు కాదని... వాళ్లు స్వాహాదారులని ఆయన దుయ్యబట్టారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంటే ఇంతమంది సలహాదారులు అవసరమా? అని ప్రశ్నించారు. మింగ మెతుకు లేదు... మీసాలకు సంపంగి నూనె అన్నట్టుగా పరిస్థితి ఉందని అన్నారు. ఒక్కో సలహాదారుడికి నెలకు రూ. 5 లక్షలు ఖర్చు అవుతోందని... వాళ్లు సలహాలు ఇచ్చింది లేదు, ముఖ్యమంత్రి స్వీకరించింది లేదని దుయ్యబట్టారు. ఒక్క మైనార్టీ శాఖకే నలుగురు సలహాదారులా? అని అసహనం వ్యక్తం చేశారు. సలహాదారులపై కోర్టులు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదని... సలహాదారులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. సలహాదారుల వ్యవస్థ వైసీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారిందని మండిపడ్డారు.