శరత్ బాబు ఆస్తులు ఎవరికి అనే విషయంలో ఆయన తమ్ముడు ఏం చెప్పారంటే.. !

  • ఈ నెల 22న కన్నుమూసిన శరత్ బాబు
  • శరత్ బాబు పేరిట భారీ ఆస్తులు
  • విల్లులో ఏం రాసి ఉంటే దాని ప్రకారం వెళ్తామన్న తమ్ముడు మధు
దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు శరత్ బాబు ఈనెల 22న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ మరో ముద్దుబిడ్డను కోల్పోయింది. మరోవైపు ఆయనకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. మాల్స్, విల్లాలు కూడా ఆయన పేరు మీద ఉన్నట్టు చెపుతున్నారు. శరత్ బాబుకు పిల్లలు లేకపోవడంతో ఈ ఆస్తులు ఎవరికి చెందుతాయో అనే చర్చ జరుగుతోంది. శరత్ బాబుకు 8 మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరిలో శరత్ బాబు మూడోవాడు. పెద్దన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తన తోబుట్టువులందరినీ శరత్ బాబే చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేవాడు. 

మరోవైపు ఆస్తుల పంపకంపై శరత్ బాబు తమ్ముడు మధు మాట్లాడుతూ... ఆస్తుల పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన విల్లు ఎలా రాస్తే, ఎవరికి రాస్తే వారికే ఆస్తులు చెందుతాయని చెప్పారు. అన్న ఆస్తి కోసం తాము తగువులాడుకోమని, తమది ఉమ్మడి కుటుంబమని, ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. 12వ రోజు పూర్తయిన తర్వాత లాకర్లు తెరిచి చూస్తామని... విల్లు రాసి ఉంటే దాని ప్రకారం వెళ్తామని, విల్లు రాయకపోతే ఏం చేయాలనేది అందరం కలిసి నిర్ణయించుకుంటామని చెప్పారు. విల్లులో ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోయినా ఏమీ అనుకోమని అన్నారు.


More Telugu News