రెచ్చిపోతున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి ఏకంగా 400 సరిహద్దు రక్షణ గ్రామాల నిర్మాణం

  • ఉత్తరాఖండ్‌ సమీపంలో వాస్తవాధీన రేఖకి 11 కి.మీ దూరంలో నిర్మాణం
  • 250 ఇళ్లతో కూడిన గ్రామాల ఏర్పాటు ముమ్మరం
  • వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి పర్యవేక్షిస్తున్న భారత సైన్యం
భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ రెచ్చిపోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న డ్రాగన్ సైన్యం తాజాగా ఉత్తరాఖండ్‌కు ఆనుకుని సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 250 ఇళ్లతో కూడిన ఈ సరిహద్దు గ్రామాలను వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి)కి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పర్యవేక్షణలో ఉత్తరాఖండ్‌కు ఆనుకుని ఉన్న ఎల్ఏసీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో దాదాపు 55-56 ఇళ్ల నిర్మాణంలో చైనా పాలుపంచుకుంటోంది.

సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్‌లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద సముదాయాలుగా ఈ గ్రామాలను చైనా నిర్మిస్తోంది. ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు భారత సైన్యం ఇదివరకే తెలిపింది. కాగా, ఉత్తరాఖండ్ చైనాతో 350 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. చాలా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు జీవనోపాధి అవకాశాల కొరత కారణంగా వలస వెళ్తున్నారు.


More Telugu News