చచ్చిపోతున్న చీతాలు.. ‘కునో’లో మరో రెండు కూనల మృత్యువాత

  • చీతా కూన మరణించిన రెండు రోజులకే మరో రెండు మృత్యువాత
  • కునో పార్క్‌లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు
  • బక్కచిక్కి బలహీనంగా మారిన కూనలు
  • ఒక కూన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు
  • ఆందోళన కలిగిస్తున్న చీతాల మరణాలు
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ చీతా కూన మరణించిన రెండు రోజులకే మరో రెండు కూనలు మరణించాయి. జన్మించిన నాలుగు కూనల్లో మూడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 24న చీతా ‘జ్వాల’ నాలుగు కూనలకు జన్మనిచ్చింది. వాటిలో మూడు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది. 

చీతా కూనలన్నీ బలహీనంగా ఉండి డీహైడ్రేషన్‌కు గురయ్యాయని, మరణానికి అదే కారణమని కునో నేషనల్ పార్క్ తెలిపింది. విపరీత వాతావరణ పరిస్థితులకు తోడు ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఉండడం కూడా కూనల మరణాలకు కారణమని తెలుస్తోంది. చీతా కూనలు బలహీనంగా ఉండడంతో వెంటనే అప్రమత్తమైన పర్యవేక్షక బృందం వాటిని చికిత్స కోసం తరలించింది. వాటిలో రెండింటి పరిస్థితి దిగజారడంతో అవి మరణించాయని, వాటిని రక్షించలేకపోయామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఒక కూన ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉన్నట్టు చెప్పారు. దానిని కాపాడుకునేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాలోని చీతా నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో మే 9న ఆడ చీతా ‘దక్ష’ మృతి చెందింది. అంతకుముందు నెలలో ‘ఉదయ్’ అనే చీతా ప్రాణాలు కోల్పోయింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ‘సాషా’ అనే చీతా మార్చి 27న మరణించింది. తాజాగా కూనల మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వాటి సంఖ్య 6కు పెరిగింది. ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 చీతాలను దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. వాటిలో ఓ చిరుత నాలుగు కూనలకు జన్మనివ్వడంతో చీతాల సంఖ్య 24కు పెరిగింది. ఇప్పుడు ఆరు చీతాల మరణంతో వాటి సంఖ్య 18కి తగ్గింది.


More Telugu News