సివిల్స్‌ పరీక్షల్లో ట్విస్ట్.. కలల ఉద్యోగానికి అడుగు దూరంలో నిలిచిపోయిన యువతులు

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • అయేషా ఫాతిమా, అయేషా మక్రానీలకు 184 ర్యాంకు
  • హాల్ టిక్కెట్ల నెంబర్లు కూడా ఒకటే
  • దీంతో, ఆ ర్యాంకు తమదేనంటూ పోలీసులను ఆశ్రయించిన అభ్యర్థులు
  • తప్పు ఎక్కడ జరిగిందో తేలాలి అని అంటున్న యూపీఎస్సీ అధికారులు
సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి, కోరుకున్న కొలువులో చేరడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే జీవితంలో గెలుపొందినట్టేనని విద్యార్థులు భావిస్తుంటారు. కానీ, ఇటీవలి పరీక్షలో ఇద్దరు మహిళా అభ్యర్థులు విజయం సాధించినా తమ కలల ఉద్యోగానికి మాత్రం అడుగు దూరంలో నిలిచిపోయారు. ఇద్దరిదీ ఒకే ర్యాంకు, ఒకే హాల్ టిక్కెట్ నంబర్ కావడంతో ఆ ర్యాంకు కోసం వారిద్దరూ యూపీఎస్‌సీని ఆశ్రయించారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మధ్యప్రదేశ్‌కు చెందిన అయేషా ఫాతిమా(23), అయేషా మక్రానీ(26), ఇటీవల సివిల్స్‌లో 184వ ర్యాంకు సాధించారు. అయితే, ఇద్దరి అడ్మిట్ కార్డు నెంబర్లు కూడా ఒకటే కావడంతో ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. ఆ ర్యాంకు ఎవరికి కేటాయించాలనే దానిపై సందిగ్ధత ఏర్పడింది. 

అయితే, వారి అడ్మిట్ కార్డుల్లో కొన్ని కీలక వ్యత్యాసాలు కనిపించాయని అధికారులు చెప్పారు. ఇద్దరికీ మంగళవారం ఏప్రిల్ 25న పర్సనాలిటీ టెస్టు నిర్వహించగా మక్రానీ అడ్మిట్ కార్డులో గురువారం అనీ, ఫాతిమా కార్డులో మంగళవారం అని ఉంది. అంతేకాకుండా, ఫాతిమా అడ్మిట్ కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతో పాటూ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మక్రానీ కార్డులో మాత్రం ఇవేం కనిపించలేదు. 

దీంతో, యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమానే అసలు అభ్యర్థి అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, మక్రానీని తప్పుబట్టలేమని, అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తేలాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో, స్థానికంగా ఈ ఉదంతంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


More Telugu News