టీ20ల్లో మైండ్ సెట్ మార్చుకోకపోతే అయిపోయినట్టే: రోహిత్ శర్మ

  • ప్రత్యర్థి చేతిలోకి మ్యాచ్ వెళ్లిపోయినట్టేనన్న రోహిత్ శర్మ
  • వేగంగా 40 పరుగులు చేస్తే త్వరగా అవుటైనా ఫర్వాలేదన్న అభిప్రాయం
  • ఏడుగురు బ్యాటర్లు తమ వంతు పాత్ర పోషించాలని సూచన
గతంతో పోలిస్తే టీ20 క్రికెట్ ఎంతో మారిపోయినట్టు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ టీమ్ సారథి రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. క్రీజులో జిడ్డుగా కుదురుకుని ఇన్నింగ్స్ నిర్మించే విధంగా ఆడే రోజులు పోయాయన్నాడు. టీ20ల్లో యాంకర్ పాత్రకు ప్రాధాన్యం లేదన్నాడు. ఒకవేళ ఇన్నింగ్స్ ఆరంభంలో 20 పరుగులకే మూడు, నాలుగు వికెట్లు కోల్పోతే తప్పించి ఇన్నింగ్స్ ను నిర్మించే విధంగా ఆడాల్సిన అవసరం లేదన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలాంటి సందర్భాలు కూడా అరుదేనన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ని కొత్త పుంతలు తొక్కిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. 

మైండ్ సెట్ మార్చుకోకపోతే ఆట అయిపోయినట్టేనన్నాడు. అవతలి వారు భిన్నంగా ఆలోచించి ఆటను తదుపరి దశకు తీసుకెళతారని పేర్కొన్నాడు. ప్రతీ బ్యాటర్ తన వంతు పాత్ర పోషిస్తే చాలని.. కేవలం కొన్ని బంతులకే 30-40 పరుగులు సాధించి అవుటైనా నష్టం లేదన్న అభిప్రాయాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు. 

‘‘ఏడుగురు బ్యాటర్లు తమవంతు పాత్ర పోషించాలి. మంచి స్కోరు సాధిస్తే మంచిదే. కనీసం 10-15-20 బంతుల్లో 30-40 పరుగులు సాధించినా మంచిదే. అది గేమ్ ను మార్చేస్తుంది. జట్టు గెలుపునకు తమ వంతు కృషి చేసినట్టు అవుతుంది’’ అని నిన్నటి మ్యాచ్ అనంతరం చెప్పాడు.


More Telugu News