మండే ఎండల నుంచి ఉపశమనం.. చల్లటి వార్త చెప్పిన ఐఎండీ

  • దేశంలో హీట్ వేవ్ ముగిసిందని ప్రకటన
  • ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వెల్లడి
  • ఉత్తర భారతంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. ఉదయం పూట కూడా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదంతా హీట్ వేవ్ ప్రభావమేనన్న భారత వాతావరణ శాఖ.. తాజాగా చల్లటి కబురు చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని, ఎండలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుతాయని తెలిపింది. అంతేకాదు, ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్ లలో తుపాను సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అందుకే ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వివరించారు. ఒకటి రెండు రోజుల పాటు ఈ రాష్ట్రాలలోని కొండప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్ కె జెనామణి పేర్కొన్నారు. ఇక, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గురు, శుక్రవారాల (25, 26 తేదీల) లో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.


More Telugu News