అత్తమామల నుంచి తన బిడ్డలను తీసుకెళ్లిన తండ్రిపై కిడ్నాప్ కేసు.. కోర్టు తీర్పు ఏంటంటే..!

  • తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లల్ని తన భర్త కిడ్నాప్ చేశాడంటూ మహిళ ఫిర్యాదు
  • భర్తతో పాటూ మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు
  • హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
  • ఇస్లామిక్ చట్టాల ప్రకారం పోలీసులు పెట్టిన కేసు సరికాదంటూ న్యాయస్థానం తీర్పు
అత్తమామల వద్ద ఉంటున్న తన పిల్లలను వెంట తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఏపీ హైకోర్టు తాజాగా ఊరటనిచ్చింది. వ్యక్తితో పాటూ అతడి బంధువుపై పోలీసులు పెట్టిన కిడ్నాప్ కేసును కొట్టేసింది. ఈ కేసులో పోలీసుల చర్యను కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలను భర్త, మరో వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేశారన్న మహిళ ఫిర్యాదుపై అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు 2022 సెప్టెంబర్ 24 కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ పిల్లల తండ్రి, మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఈ కేసులో వారి లాయర్ వాదనలు వినిపిస్తూ ముస్లిం చట్టాలను కోర్టు దృష్టికి తెచ్చారు. సున్నీ మహమదీయ లా ప్రకారం కుమారుడికి ఏడు, షియా చట్టం ప్రకారం రెండేళ్లు వచ్చేంతవరకూ తల్లి తన సంరక్షణలో ఉంచుకోవచ్చన్నారు. మైనర్లకు తండ్రి సహజ, ప్రాథమిక సంరక్షకుడని కూడా తెలిపారు. పోలీసులు తండ్రిపై కిడ్నాప్ కేసు పెట్టడం తప్పని వాదించారు. తండ్రి వెంట వెళ్లిన సమయంలో చిన్నారుల్లో ఒకరికి 8, మరొకరికి 10 ఏళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తండ్రి, మరో వ్యక్తిపై ఉన్న కిడ్నాప్ కేసును కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.


More Telugu News