కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి జగన్.. అన్ని పార్టీలు రావాలని విన్నపం!

  • ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
  • తాము రామని ఇప్పటికే ప్రకటించిన 19 పార్టీలు
  • రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ రావాలని కోరిన జగన్
ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం వివాదానికి దారి తీసింది. రాష్ట్రపతి ప్రారంభిస్తేనే తాము వస్తామని లేకపోతే రామని కాంగ్రెస్ సహా 19 పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 

కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీకి జగన్ అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంట్ మన దేశ ఆత్మను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ భవనం దేశ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినదని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఈ అద్భుత కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఉన్న నిజమైన స్ఫూర్తితో తమ పార్టీ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పారు.


More Telugu News