మధ్వాల్ దెబ్బకు లక్నో ఇంటికి.... ముంబయి ముందుకు!

  • ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు
  • లక్ష్యఛేదనలో 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన లక్నో
  • 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ఆకాశ్ మధ్వాల్
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ముంబయి బౌలర్ ఆకాశ్ మధ్వాల్ సంచలన బౌలింగ్ తో లక్నో సూపర్ జెయింట్స్ ను ఫినిష్ చేశాడు. మధ్వాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. తద్వారా ఐపీఎల్ లో అతి తక్కువ పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును మధ్వాల్ సమం చేశాడు. 2009లో కుంబ్లే రాజస్థాన్ రాయల్స్ పై 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు మధ్వాల్ కూడా కుంబ్లే సరసన చేరాడు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో ఏ దశలోనూ గెలుపు దిశగా సాగుతున్నట్టు కనిపించని లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. 

లక్నో ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్ మెన్ రనౌట్ కావడం ఆ జట్టు ఆటగాళ్ల మధ్య సమన్వయ లేమిని ఎత్తిచూపింది. మొదట్లోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్కస్ స్టొయినిస్ 27 బంతుల్లోనే 40 పరుగులు చేసినా, చివరికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. నికోలాస్ పూరన్ డకౌట్ కావడం ఆ జట్టు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మధ్వాల్ వరుస బంతుల్లో ఆయుష్ బదోని (1), పూరన్ లను అవుట్ చేయడంతో లక్నో జట్టు కోలుకోలేకపోయింది. 

లక్నో ఇన్నింగ్స్ చూస్తే, ఓపెనర్ కైల్ మేయర్స్ (18), ప్రేరక్ మన్కడ్ (3), కెప్టెన్ కృనాల్ పాండ్యా (8), దీపక హుడా (11) పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3.3 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టగా, క్రిస్ జోర్డాన్ 1, పియూష్ చావ్లా 1 వికెట్ తీశారు. 

ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన ముంబయి జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఈ నెల 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. నేటి మ్యాచ్ లో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


More Telugu News