బసవతారకం ఆసుపత్రికి జాతీయ అవార్డు... బాలకృష్ణను అభినందించిన చంద్రబాబు

బసవతారకం ఆసుపత్రికి జాతీయ అవార్డు... బాలకృష్ణను అభినందించిన చంద్రబాబు
  • భారత్ లో రెండో అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఆసుపత్రి
  • అవుట్ లుక్ మ్యాగజైన్ అవార్డు
  • ఈ ఆసుపత్రి సిబ్బంది కృషి అసామాన్యం అంటూ చంద్రబాబు అభినందనలు
గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.  

భారత్ లోనే రెండో అత్యుత్తమ ఆంకాలజీ ఆసుపత్రిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు ఎంపిక చేసిందని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, యాజమాన్యం, సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సను సమగ్ర రీతిలో అందించేందుకు ఈ ఆసుపత్రి బృందం బృహత్ ప్రయత్నం చేస్తోందంటూ చంద్రబాబు కొనియాడారు. 

వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ, వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని వివరించారు.


More Telugu News