ఒక్క ట్వీట్ తో చర్చకు తెరదీసిన రవీంద్ర జడేజా

  • చెన్నై ఫ్యాన్స్ ను లక్ష్యంగా చేసుకున్న రవీంద్ర జడేజా
  • అప్ స్టాక్ 'మోస్ట్ వ్యాల్యూబుల్ అస్సెట్ ఆఫ్ ద మ్యాచ్'గా గుర్తింపు
  • కొందరు అభిమానులకు తనేంటో తెలియడం లేదంటూ ట్వీట్
రవీంద్ర జడేజా.. సీఎస్కే ఫ్యాన్స్ భిన్న ధ్రువాలుగా మారిపోయారని అనడంలో అతిశయోక్తి లేదు. 2022 ఐపీఎల్ సీజన్ కు చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరించి, వరుస వైఫల్యాలతో ఆ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన జడేజా.. తర్వాత అదే జట్టుతో కొనసాగుతున్నాడు. నాయకత్వం మార్పిడితో 2022 సీజన్ లో లీగ్ దశ నుంచే చెన్నై ఇంటి ముఖం పట్టింది. ఈ వ్యవహారం జడేజాకి, చెన్నై జట్టు యాజమాన్యానికి మధ్య అంతరం కూడా తీసుకొచ్చింది. కానీ, చివరికి సీఎస్కే యాజమాన్యం జడేజాకి నచ్చ జెప్పింది. తిరిగి అతడ్ని జట్టులోకి తీసుకొచ్చింది. 

అప్పటి నుంచి జడేజాపై సీఎస్కే అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకోవాలి. సాధారణంగా సీఎస్కే అభిమానులు ధోనీ నామ జపం చేస్తుంటారు. క్రీజులోకి ధోనీ త్వరగా రావాలని, అతడ్ని చూడాలని కోరుకుంటారు. దీన్ని కూడా జడేజా విమర్శనాత్మకంగా తీసుకోవడాన్ని గమనించాలి. ధోనీ త్వరగా రావడం కోసం తనను త్వరగా అవుట్ కావాలని చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ఇటీవలే అతడు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఒక్క ట్వీట్ తో మరోసారి చెన్నై ఫ్యాన్స్ ను జడేజా కెలికాడు. 

గుజరాత్-సీఎస్కే మధ్య మంగళవారం చెన్నైలో క్వాలిఫయర్ మ్యాచ్ నడిచింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో మెరిసిన జడేజాని ‘అప్ స్టాక్’ అనే బ్రోకరేజీ సంస్థ ‘మోస్ట్ వాల్యూబుల్ అస్సెట్ ఆఫ్ ద మ్యాచ్’ అని గుర్తించి రూ.లక్ష నగదు బహుమతిని అందించింది. దీన్ని తన ఆయుధంగా మలుచుకున్నాడు జడేజా. ‘‘అప్ స్టాక్స్ కు తెలుసు. కానీ కొందరు అభిమానులకే తెలియడం లేదు’’ అని ట్వీట్ చేశాడు. పక్కన నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు. దీని ద్వారా చెన్నై ఫ్యాన్స్ తనను గుర్తించడం లేదన్న అసహనం వ్యక్తం చేసినట్టయింది.


More Telugu News