తుళ్లూరులో 144 సెక్షన్.. జడ శ్రవణ్ కుమార్ అరెస్ట్.. ఉద్రిక్తత

  • ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా 48 గంటల దీక్షకు పిలుపునిచ్చిన జడ శ్రవణ్ కుమార్
  • ర్యాలీలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు
  • అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దీక్షకు వచ్చిన శ్రవణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తుళ్లూరు పీఎస్ కు తరలించారు. 

శ్రవణ్ దీక్షకు మద్దతుగా వచ్చిన పలువురు రాజధాని రైతులు, మహిళా రైతులు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ర్యాలీలు, నిరసనలు, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తుళ్లూరులో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని చెప్పారు. తుళ్లూరులోని అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తుళ్లూరులో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


More Telugu News